అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Intelligence Bureau | పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో ఉగ్ర కదలికలు మరోసారి తెరపైకి రావడంతో కలకలం రేపింది. గతంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురిని అరెస్టు చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తాజాగా ఉగ్రవాదులతో అనుబంధం ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం కలవరపాటుకు గురి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా(Sathya Sai District) ధర్మవరంలో ఐబీ అధికారులు, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ భద్రతపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలకు కీలక సమాచారం లభించింది. ఈ నేపథ్యంలో ధర్మవరంనకు చెందిన వ్యక్తి పాకిస్తాన్(Pakistan)లోని ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో స్థానికంగా ఉండే యువకుడు నూర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీ స్టాల్‌లో పని చేస్తున్న అతని నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 సిమ్ కార్డులతో పాటు పలు అనుమానిత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ పాక్ ఉగ్రవాదులతో ఫోన్ కాల్స్ చేయడంతో పాటు సోషల్ మీడియా(Social Media)లో టచ్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్న నూర్ సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి సారించారు.