అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | దక్షిణాఫ్రికా (South Africa)తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. త్వరలో సౌత్ ఆఫ్రికా భారత పర్యటనకు రానుంది. ఆ జట్టు భారత్‌తో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ–20లు ఆడనుంది.
దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో టెస్ట్ జట్టును సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటింది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, నవంబర్ 22 నుంచి గువాహటి వేదికగా టెస్ట్‌లు జరగనున్నాయి. ఇంగ్లాండ్ టూర్లో గాయపడి కొంతకాలంగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్ (Rishabh Pant) మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడిని వైస్ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా ప్రస్తుతం ఇండియా-ఎ, సౌతాఫ్రికా-ఎ మధ్య జరుగుతున్న అనధికారిక టెస్టుల్లో పంత్ ఆడుతున్నాడు.
BCCI | అప్పుడు గాయం..
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సందర్భంగా రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల బెంగళూరు (Bangalore)లో దక్షిణాఫ్రికా ఏతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో ఇండియా ఎ జట్టుకు పంత్ నాయకత్వం వహించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 113 బంతుల్లో 90 పరుగులు చేశాడు. గాయం కారణంగా వెస్ట్ ఇండిస్తో జరిగిన రెండు టెస్ట్‌లకు దూరమైన తర్వాత పేసర్ ఆకాష్ దీప్ (Akash Deep) కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో ప్రతిభ చూపిన మహ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. కాగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో, రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి 26 వరకు గౌహతిలో జరుగుతుంది.
BCCI | భారత జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.
