అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tata Consultancy Services | భారతదేశపు అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) ఏకంగా 12261మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని అనుకుంటున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ తొలగింపు ముఖ్యంగా కంపెనీలోని మీడియం, సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
TCS తన ప్రకటనలో, ఈ ఉద్యోగ తొలగింపులు సంస్థను భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కొత్త టెక్నాలజీలను స్వీకరించడం, మరియు విదేశీ మార్కెట్లలో విస్తరణకు ఇది అవసరమని తెలిపింది.
Tata Consultancy Services | ఉద్యోగులపై వేటు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (Artificial Intelligence) విస్తృతంగా ఉపయోగించడమే కాక కొత్త ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. శ్రామిక శక్తిని పునర్నిర్మించడం, కొత్త టెక్నాలజీలు, AIని స్వీకరించడం ద్వారా ఫ్యూచర్ కోసం మా క్లయింట్‌లను సిద్ధం చేసుకుంటున్నామని కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా తిరిగి నియమించబడటం సాధ్యం కాని కొంతమంది ఉద్యోగులను కంపెనీ విడిచిపెట్టాల్సి వస్తోంది అని ప్రకటించింది. ఉద్యోగులను తొలగించినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో (ఏప్రిల్-జూన్) 5,000 మంది కొత్త ఉద్యోగులను (Employees) సంస్థ నియమించుకోవడం గమనార్హం. 2025 జూన్ 30 నాటికి TCS ఉద్యోగుల సంఖ్య 6,13,069గా నమోదైంది.
TCS 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 63,437 కోట్ల ఆదాయాన్ని, మరియు రూ. 12,760 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే వరుసగా 1.3% మరియు 5.9% వృద్ధి. అయితే, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO కె.కృతివాసన్ (CEO K. Krithivasan) ప్రకారం, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో డిమాండ్ తగ్గుముఖం పడుతోంది. “2026 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధ్యం కాదని భావిస్తున్నాం,” అని ఆయన పేర్కొన్నారు. తొలగించబడిన ఉద్యోగులకు TCS ఆర్థిక సాయంతో పాటు అవుట్‌ప్లేస్‌మెంట్ మద్దతు, కౌన్సెలింగ్, ఇతర సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. TCS మాత్రమే కాక, మైక్రోసాఫ్ట్ కూడా 2025లో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి. Layoffs.fyi గణాంకాల ప్రకారం 2025లో ఇప్పటివరకు 80 వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.