అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Suresh Gopi | కేంద్ర పర్యాటక, పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
మలయాళ సినీ నటుడిగా పేరుపొందిన ఆయన, రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని వెల్లడించారు. కేరళలోని కన్నూర్‌లో జరిగిన బీజేపీ సమావేశం(BJP Meeting) లో సురేష్ గోపి మాట్లాడుతూ.. “నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ప్రజా సేవ చేయాలన్న అంకితభావం ఉన్నా, ఆర్థికంగా స్థిరంగా ఉండడం కూడా అవసరం.
Suresh Gopi | ఇక సినిమాల్లోకి..
నాకు సినిమాలు అంటే ప్రాణం. నటన నా వృత్తి, నా జీవనాధారం. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నాను” అని అన్నారు. నేను మంత్రి కావాలని ఆశపడలేదు, కానీ ఈ బాధ్యతను గౌరవంగా స్వీకరించాను. అయితే నటనను కొనసాగిస్తూ ప్రజా సేవ చేయాలనేది నా కోరిక అని గోపి(Suresh Gopi) వివరించారు. తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు సి. సదానందన్ మాస్టర్(C.Sadanand Master)ను కేంద్ర మంత్రిగా నియమించాలని కూడా ఆయన సూచించారు. నన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే, నా స్థానంలో సదానందన్ మాస్టర్‌గారిని నియమించండి. ఆయన కేరళ రాజకీయాల్లో పోరాట యోధుడు. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అవుతుంది” అని గోపి అన్నారు.
1994లో సిపిఐ(ఎం) కార్యకర్తల దాడిలో రెండు కాళ్లను కోల్పోయినా, సదానందన్ మాస్టర్ కేరళ(Kerala) ఉత్తర ప్రాంత రాజకీయాల్లో విశేష గౌరవాన్ని సంపాదించారు. ఇక సురేష్ గోపి మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. 2016లో బీజేపీలో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుండి విజయం సాధించి కేరళలో బీజేపీకి చారిత్రాత్మక విజయం అందించారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, తన అభిమానులు ఆయనను తిరిగి వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గోపి స్వయంగా “సినిమాల్లోకి తిరిగి రావాలి” అని అనుకుంటున్నట్టు ప్రకటించడం అభిమానులకే కాక, మలయాళ సినీ ప్రపంచానికి కూడా సంతోషాన్ని తీసుకొచ్చింది. మరి సురేష్ గోపి రాజీనామా చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఆయన వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.