అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Guntur GGH | ప్రముఖ నటుడు జగపతిబాబు నటించిన ‘అధినేత’ చిత్రంలోని ఆసుపత్రి సీన్‌ను గుర్తు చేసే సంఘటన గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో వాస్తవంగా చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఎప్పటికప్పుడు జీజీహెచ్ సేవ (GGH Service)లపై వస్తున్న విమర్శలు, రాత్రి పూట వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వీ రమణ స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.నవంబర్ 25న రాత్రి 10 గంటల సమయంలో ఆయన ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి పూర్తిగా వృద్ధుడి వేషంలో జీజీహెచ్‌కు చేరుకున్నారు.
Guntur GGH | సినిమా స్టైల్‌లో..
చింపిరి జట్టు, పాతచొక్కా, మాసిన కండువా, చేతిలో కర్ర, ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా ఎవరికీ గుర్తుపట్టనివిధంగా మారు వేషం వేసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యం చేయాలని వైద్య సిబ్బందిని అభ్యర్థించడంతో, అక్కడి డాక్టర్లు కొన్ని పరీక్షలకు రిఫర్ చేయడం ఆయన గమనించారు. తనిఖీల సందర్భంగా డాక్టర్ రమణ ఆసుపత్రి వివిధ విభాగాలను సందర్శించారు. వరండాల్లో వీధి కుక్కలు సంచరిస్తుండటం, ఐసీయూల వద్ద సిబ్బంది స్పందన, ఫార్మసీ పరిస్థితి వంటి పలు అంశాలను స్వయంగా పరిశీలించారు. ఒక గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరిగి, సేవలపై ఉన్న లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఇటీవల జీజీహెచ్‌పై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ సూపరింటెండెంట్ (Superintendent) స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడాన్ని ప్రజలు, వైద్య వర్గాలు అభినందిస్తున్నాయి.
గుంటూరు ఘటనకు ముందు అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అప్పట్లో కలెక్టర్ వినోద్ కుమార్ (Collector Vinod Kumar) సాధారణ వ్యక్తిగా మాస్క్, భుజంపై టవల్‌తో మారువేషంలో ఆసుపత్రికి వెళ్లి సేవలను పరిశీలించారు. అంబులెన్స్ ఛార్జీలు, వైద్య సేవలపై వివరాలు స్వయంగా తెలుసుకుని లోపాలను గుర్తించారు. ఈ రెండు సంఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government Hospital) ప్రజలకు అందే సేవల నాణ్యతపై అధికారులు మరింత దృష్టి పెడుతున్నదానికి నిదర్శనంగా భావిస్తున్నారు.