అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Students Protest | ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడుతోందని విద్యార్థినులు ధర్నా చేశారు. షాద్‌నగర్ జాతీయ రహదారిపై గురుకుల డిగ్రీ కాలేజీ (Gurukul Degree College) విద్యార్థినులు బైఠాయించారు. గురుకులంలో అక్రమాలు ఆపండి.. ఆ తర్వాత విద్య అందించండి అంటూ నినాదాలు చేశారు.
నాగర్ కర్నూల్ (Nagar Kurnool) గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకుంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. తమ దగ్గర లంచాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లయిన విద్యార్థుల నుంచి పరీక్షలు రాయడానికి రూ.పది వేల వరకు లంచాలు తీసుకుంటుందన్నారు. టీసీలు ఇవ్వడానికి రూ.3 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తోందన్నారు. ప్రిన్సిపాల్‌తో పాటు ఆమెకు సహకరిస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Students Protest | ఉద్రిక్తతంగా మారిన ఆందోళన
విద్యార్థినుల ధర్నాతో జాతీయ రహదారి (National Highway)పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వచ్చి విద్యార్థులను సముదాయించారు. అయినా వారు వినలేదు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన చేస్తామన్నారు. ప్రిన్సిపల్ శైలజ తమను వేధిస్తుందని, ప్రభుత్వం నుంచి తమకు వచ్చే నిధులను వాడుకుంటోందని ఆరోపించారు. ప్రశ్నించిన విద్యార్థులను ఇంటర్నల్ పరీక్ష (Internal Exams)లను రాయనివ్వలేదన్నారు.ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్, విద్యార్థినుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై ఆమె చేయి చేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు కానిస్టేబుల్‌ను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు పలువురు విద్యార్థులను వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.