అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fire Safety Rules | ఫైర్ సేఫ్టీ అందరి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) అన్నారు. ఇటీవల నగరంలో అగ్ని ప్రమాదాలు (fire accidents) పెరగడంతో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
రానున్నది వేసవి కాలమని, నిప్పు రగిలితే మంటలు వ్యాపించి భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే హైడ్రా తనిఖీలు చేసి పలు దుకాణాలను సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. నెల రోజులు వ్యవధి కావాలని షాపుల యజమానులు, వ్యాపార సంఘాలకు చెందిన ప్రతినిధులు కోరడంతో తనిఖీలకు విరామం ఇచ్చామన్నారు. ఆ లోగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
fire safety rules | నిబంధనలు పాటించాలి
అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. దుకాణాదారులు నిబంధనలు పాటించాలన్నారు. సెల్లార్లను వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలన్నారు. గోదాములుగా మార్చి, ఆ వస్తువులు పోతాయని గ్రిల్స్ ఏర్పాటు చేసి తాళాలతో బందించొద్దన్నారు. అలాగే సెల్లార్లను చెత్తతో నింపొద్దన్నారు. వాచ్‌మన్ నివాసాలు సైతం ఉండకుండా చూసుకోవాల్నారు. సెల్లార్లతో పాటు.. ర్యాంపులు, కారిడార్లు, మెట్ల మార్గాలు ఎట్టి పరిస్థితుల్లో మూసి వేయొద్దని కమిషనర్ సూచించారు.
నాణ్యమైన పరికరాలను వాడండి
ఐఎస్వో స్టాండర్డ్ కరెంటు వైర్లను, స్విచ్ బోర్డులను, ప్యానెల్ బోర్డులను మాత్రమే వినియోగించాలని రంగనాథ్ సూచించారు. విద్యుత్ వినియోగానికి తగ్గట్టు పవర్ కనెక్షన్లు తీసుకోవాలన్నారు. కరెంటు స్తంభం నుంచి వచ్చే వైర్లు, వ్యాపార సముదాయానికి విద్యుత్‌ను సరఫరా చేసే వైర్లను అనుసంధానం చేసే ప్యానల్ బోర్డు వద్ద పొరపాటున నిప్పురవ్వలు పడినా వెంటనే మంటలు అంటుకోకుండా.. కంకరతో ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అప్రమత్తం చేసే స్మోక్ డిటెక్టర్లను అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు.