అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | కామారెడ్డి మున్సిపాలిటీలోని (Kamareddy Municipality) 49 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) కౌన్సిలర్ అభ్యర్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో కౌన్సిలర్ అభ్యర్థులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Shabbir Ali | కౌన్సిలర్ అభ్యర్థులకు దిశానిర్దేశం..
కౌన్సిలర్ అభ్యర్థులుగా బీఫాంలు పొందిన వారిని ఈ సందర్భంగా షబ్బీర్అలీ సన్మానించారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipl Elections) అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అభివృద్ధే కాంగ్రెస్ నినాదమని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంత్రంతోనే ప్రజల ముందుకు వెళ్తుందన్నారు.
Shabbir Ali | రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకులు మాయం
రెండేళ్లుగా ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో కనపడలేదని షబ్బీర్ విమర్శించారు. అవినీతి గురించి ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం రైతులు భూములు కొనుగోలు చేస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు అరోరా కాలేజీకి దారాదత్తం చేసింది ఎవరో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే అమ్ముకున్నది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులుగా కనపడని ఎమ్మెల్యే ఎన్నికలు రాగానే ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు.
Shabbir Ali | గత ప్రభుత్వ హయాంలో..
గత ప్రభుత్వ హయాంలో కామారెడ్డి పట్టణం ఎదుర్కొన్న నిర్లక్ష్యానికి స్వస్తి పలికి, రాబోయే కాలంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలతో పట్టణ రూపురేఖలు మారుస్తామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గత పదేళ్లలో పట్టణాన్ని పట్టించుకోని వారు ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని, ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు ఇంద్రకరణ్ రెడ్డి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇందుప్రియ, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.