అక్షరటుడే, వెబ్డెస్క్: Marriage Season 2026 | హిందూ క్యాలెండర్ (Hindu Clalender) ప్రకారం “మౌఢ్యమి” లేదా “మూఢమి” కాలాన్ని శుభకార్యాలకు అనుకూలం కాదని జ్యోతిష్య పండితులు భావిస్తారు. ముఖ్యంగా శుక్ర మౌఢ్యమి సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలు వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా ఉండటం సాంప్రదాయంగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్ 26 నుంచి ప్రారంభమైన శుక్ర మౌఢ్యమి కారణంగా దాదాపు 83 రోజుల పాటు శుభకార్యాలకు విరామం ఏర్పడింది.
Marriage Season 2026 | శుక్ర మౌఢ్యమి అంటే ఏమిటి?
వేదాంగ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు వివాహ సౌఖ్యం, దాంపత్య జీవితం, ఐశ్వర్యం, సిరిసంపదలకు ప్రధాన కారక గ్రహంగా భావిస్తారు. శుక్రుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లి అస్తమయ స్థితిలోకి చేరే కాలాన్నే “శుక్ర మౌఢ్యమి” (Shukra Maudhyami) గా పరిగణిస్తారు. ఈ సమయంలో శుక్ర గ్రహ ప్రభావం బలహీనంగా ఉంటుందని, అందువల్ల శుభకార్యాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తారు. ఈసారి ఫిబ్రవరి 17తో శుక్ర మౌఢ్యమి ముగియనుండగా, ఫిబ్రవరి 18 నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో పెళ్లిళ్లు , గృహప్రవేశాలు, ఉపనయనాలు, నామకరణాలు వంటి శుభకార్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. దాదాపు మూడు నెలల విరామం అనంతరం మళ్లీ వివాహాల సందడి మొదలుకానుంది.
పండితుల ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు అనేక శుభదినాలు లభించనున్నాయి. ఈ కాలంలో కుటుంబాలు వివాహాలు, గృహప్రవేశాలు, వ్రతాలు వంటి శుభకార్యాలకు ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నారు. అయితే మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక మాసం ప్రారంభమవుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం అధిక మాసంలో కూడా ముఖ్యమైన శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. అందువల్ల మే 9 తర్వాత మళ్లీ కొంతకాలం శుభ ముహూర్తాలకు విరామం ఏర్పడే అవకాశం ఉంది.
శుక్ర మౌఢ్యమి ముగియడం వల్ల “శుక్రబలం” పునరుద్ధరించబడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దాంపత్య జీవితం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వానికి అనుకూల పరిస్థితులు నెలకొంటాయని విశ్వసిస్తున్నారు. అందుకే ఈ కాలాన్ని శుభారంభాలకు ఉత్తమంగా భావించి ప్రజలు విస్తృతంగా శుభకార్యాలను ప్లాన్ చేసుకుంటున్నారు.