అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Corruption | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులు రూ.వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు.
ఆ అధికారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారి ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చింది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో మాజీ ఈఎన్సీ సహా ఇంజినీర్లపై ఏసీబీ గతంలో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ ఈఎన్సీ మురళీధర్, ఈఈ నూనె శ్రీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన బి.హరిరామ్ నాయక్ భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులు (ACB Officers) గుర్తించారు. ఈ మేరకు వారి ఇళ్లలో సోదాలు జరిపి పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. అయితే ఆ ముగ్గురు ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా ప్రభుత్వం వారి ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
Kaleshwaram Corruption | జప్తు చేసిన విజిలెన్స్ కమిషన్
ఈఈ నూనె శ్రీధర్ (EE Nune Sridhar) ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అధికారులు జప్తు చేశారు. ఆయనకు సంబంధించి రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.110 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. బి.హరిరామ్‌కు చెందిన రూ.11.46 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. వీటి విలువ మార్కెట్లో రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల అటాచ్ చేయాలని విజిలెన్స్‌కు ఇరిగేషన్ శాఖ అధికారులు (Irrigation Department Officers) లేఖ రాశారు. ఆయనకు సంబంధించిన రూ.100కోట్లకు పైగా ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ కేసు తేలే వరకు ఆ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీలు లేదు.