అక్షరటుడే, వెబ్డెస్క్ : Shivaratri Special Buses | మహా శివరాత్రి (Maha Shivaratri) సమీపిస్తోంది. దీంతో శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ పెరిగింది. మహా శివరాత్రి రోజు వేములవాడ (Vemulawada) రాజన్న, శ్రీశైలం మల్లన్న ఆలయాలకు భారీగా భక్తులు తరలి వెళ్తారు.
శివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) తెలిపింది. 2,243 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయల(Edupayal)కు 249 స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి నాలుగు రోజుల నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదని శివస్వాములు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. శివరాత్రికి మరింత రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Shivaratri Special Buses | 43 క్షేత్రాలకు..
శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయలతో పాటు 43 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా, 14 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు సేవలు అందిస్తాయి. కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71 స్పెషల్ బస్సులు వేశారు. కొమురవెల్లి, రామప్ప, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి ఆలయాలకు సైతం ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో టికెట్ రేట్లను సైతం పెంచారు. 50శాతం అదనంగా వసూలు చేయనున్నారు.
Shivaratri Special Buses | ఏడుపాయలలో జాతర
మెదక్ (Medak) జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల దుర్గామాత ఆలయం వద్ద మహా శివరాత్రికి జాతర సాగుతుంది. శైవ క్షేత్రం కాకున్నా.. ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలిస్తారు. మూడు రోజుల పాటు జరిగే మహా జాతరకు భక్తులు పోటెత్తుతారు. మంజీర నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. మిగతా ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు ఈ నెల 14నుంచి 16 తేదీ వరకు నడుస్తాయి. ఏడుపాయలకు మాత్రం 15 నుంచి 17 వరకు నడవనున్నాయి. హైదరాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి నుంచి ఏడుపాయలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. రెగ్యులర్గా నడిచే బస్సుల్లో సాధారణ రేట్లు వసూలు చేస్తారు.