అక్షరటుడే, వెబ్డెస్క్: Khammam District | ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు (school bus) బోల్తా పడింది. శుక్రవారం సాయంత్రం విద్యార్థులను ఇళ్లలో దింపడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. శుక్రవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem district) ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. సాయంత్రం ఖమ్మం జిల్లా (Khammam district) పెనుబల్లి మండలం గణేష్పాడు గ్రామ శివారులోని కాలువలో పాఠశాల బస్సు పల్టీ కొట్టింది. వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకొని వెళ్తుండగా అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 100 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
Khammam District | అతివేగంగా నడపడంతో..
గణేశ్పాడు గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని విద్యార్థులు ఆరోపించారు. బస్సు బోల్తా పడిన కాలువలో నీళ్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండడంతోనే అదుపు తప్పి కాలువలో పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
పాఠశాల బస్సులో వంద మంది విద్యార్థులు ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత మంది విద్యార్థులను ఎలా ఎక్కిస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలలు ఇలాగే పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నాయి. తల్లిదండ్రుల వేలకు వేలు బస్సు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు విద్యార్థుల రక్షణపై మాత్రం చర్యలు చేపట్టడం లేదు. పరిమితికి మించి విద్యార్థులను తరలించే పాఠశాల బస్సులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.