అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు(BC Reservations) ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Local Body Elections | రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
రాష్ట్రంలో మొత్తం 565 జెడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేశారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్(Election Commission) తెలిపారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని రాణికుముదిని పేర్కొన్నారు. అక్టోబర్ 23న తొలి విడత పోలింగ్, 27న రెండో విడత పోలింగ్ ఉంటుందన్నారు. నవంబర్ 11న వీటి ఫలితాలు ప్రకటించనున్నారు.
Local Body Elections | మూడు విడతల్లో జీపీల ఎన్నికలు
రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు ఉన్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. అక్టోబర్ 30, నవంబర్ 4, 8న సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడనుండటంతో అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.