అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Credit Cards Fees | క్రెడిట్ కార్డు యూజర్లకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. సర్వీస్ ఛార్జీలు, ఇతర ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం ప్రజలు క్రెడిట్ కార్డులకు (Credit Card) అలవాటు పడ్డారు. ఆ కార్డు కూడా కొందరికి నిత్య జీవితంలో భాగం అయిపోయింది. మొదట్లో ఆఫర్లతో కార్డులను అందించిన ఆయా బ్యాంకులు.. ఇప్పుడు ప్రజలు అలవాటు పడ్డాక ఛార్జీలను వడ్డిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రైవేట్ బ్యాంకులు ఛార్జీలను పెంచగా.. తాజాగా ఎస్బీఐ (SBI) ఆ జాబితాలో చేరింది.
Credit Cards Fees | వాటిపై 1 శాతం ఫీజు
చాలా మంది యూజర్లు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. థర్డ్ పార్టీ యాప్‌ల (Third-Party App) ద్వారా చెల్లింపులు చేసి డబ్బులు తీసుకొని వినియోగించుకుంటున్నారు. ఇలాంటి వారికి ఎస్బీఐ షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్లపై 1 శాతం ఫీజు వసూలు చేస్తామని ప్రకటించింది. అయితే నేరుగా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ద్వారా లేదా పీవోఎస్ యంత్రాల ద్వారా చెల్లింపులు చేస్తే మాత్రం ఎలాంటి ఫీజు ఉండదు. దీంతో నెల వారి ఖర్చుల కోసం ఎడ్యూకేషన్ ఫీజు పేరిట డబ్బులు డ్రా చేసుకునే వారికి ఛార్జీలు పడనున్నాయి. అలాగే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే (Google Pay) వంటి యాప్స్ ద్వారా చేసే విద్యా సంబంధిత లావాదేవీలపై సైతం ఫీజు వర్తిస్తుంది.
Credit Cards Fees | వాలెట్ లోడ్ ఛార్జీలు
ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే వంటి డిజిటల్ వాలెట్‌లలో డబ్బు లోడ్ చేసినా ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో వాలెట్ టాప్ అప్ చేస్తే ఒక శాతం ఛార్జీ వేస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న ఛార్జీలు కొనసాగుతాయి. క్యాష్ పేమెంట్ ఫీజు రూ.250, కార్డు రీప్లేస్ మెంట్ ఫీజు: రూ.100–రూ.250 (ఆరం కార్డులకు రూ.1,500) చెల్లించాలి. అలాగే కార్డు వినియోగదారులు మీరు కనీస బకాయి మొత్తాన్ని (MAD) సకాలంలో చెల్లించకపోతే సైతం భారీగా ఫైన్ విధించనున్నారు. కొత్త ఛార్జీలు నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

