అక్షరటుడే, కామారెడ్డి : EWS Certificate Fraud Case | పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రజాప్రతినిధి తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. కూతురిని డాక్టర్‌ను చేయాలనే ఉద్దేశంతో తప్పుడు రిజర్వేషన్ సర్టిఫికెట్ పొందాడు. విచారణ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం కూతురి ఎంబీబీఎస్ సీటుకు సైతం ఎసరు వచ్చింది.
EWS Certificate Fraud Case | తుంగలో తొక్కి..
ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని (Machareddy Mandal) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ గ్రామ సర్పంచ్ గత ఎంపీటీసీ ఎన్నికల్లో (MPTC Elections) తనకు 12 ఎకరాల భూమి ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చట్టం ప్రకారం ఐదెకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుండగా ఆయన దానిని తుంగలో తొక్కాడు. అక్రమ మార్గంలో కూతురికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందాడు. దాంతో ఆమెకు నిజామాబాద్ మెడికల్ కళాశాలలో (Nizamabad Medical College) 2019లో ఎంబీబీఎస్ సీటు లభించింది.
EWS Certificate Fraud Case | ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి..
ఈ విషయం సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి గత ఏడాది జూన్‌లో కలెక్టర్, సంబంధిత అధికారులకు, సీఎంకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరిపిన కామారెడ్డి తహశీల్దార్ జనార్దన్ కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సర్పంచ్‌పై కేసు నమోదైంది. అనంతరం మెడికల్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది.
జాతీయ మెడికల్ కమిషన్ (National Medical Commission) సదరు సర్పంచ్ కూతురు ఎంబీబీఎస్ అడ్మిషన్, రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు రిజర్వేషన్ కింద పొందిన ఇంటర్న్‌షిప్ సభ్యత్వం రికవరీకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. 15 రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Director of Medical Education), యూనివర్సిటీకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా ఫిర్యాదు చేసిన మాట నిజమేనన్నారు.