అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sameera Reddy | టాలీవుడ్లో ‘నరసింహుడు’, ‘అశోక్’ లాంటి క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సరసన వరుసగా రెండు సినిమాల్లో నటించిన సమీరా, ఆ సమయంలో వచ్చిన రూమర్స్‌తో కూడా వార్తల్లో నిలిచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘జై చిరంజీవ’ చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అందమైన చిరునవ్వు, హావభావాలతో తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమ (Hindi Film Industry)ల్లో కొన్నేళ్ల పాటు హవా సాగించిన సమీరా రెడ్డి… అనూహ్యంగా సినీ ఇండస్ట్రీకి దూరమవడం అప్పట్లో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Sameera Reddy | రీఎంట్రీ ఖాయమా..
2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఓ పాటలో అతిథిగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. మూడు భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ, పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి అంకితమైంది.ఇటీవల సమీరా రెడ్డి తన 47వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారడంతో, “సమీరా మళ్లీ సౌత్‌లో నటిస్తుందా?” అంటూ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ఏం చేస్తోంది? తిరిగి సినిమాల్లోకి వస్తుందా? అన్న ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. వాస్తవానికి కెరీర్ కొంత నెమ్మదించాక, 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేతో సమీరా వివాహం చేసుకుంది. 2015లో కుమారుడు, 2019లో కుమార్తె జన్మించడంతో పిల్లలు, కుటుంబానికే పూర్తిగా అంకితమైంది. ఈ సమయంలో శరీరంలో వచ్చిన మార్పుల వల్ల తీవ్ర డిప్రెషన్‌కు గురైనట్లు కూడా ఆమె గతంలో వెల్లడించింది. గర్భధారణ సమయంలో ఎదురైన భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం సమీరా తన ఇద్దరు పిల్లలు, కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఒకప్పుడు లాక్మే వంటి టాప్ బ్రాండ్స్‌కు ప్రమోషన్లు చేసిన ఈ భామ, ముంబైలో ర్యాంప్ వాక్స్‌తో బిజీగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో ఫ్యాషన్ షోలకూ దూరమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం, సమీరా రెడ్డి 2026లో తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘చిమ్నీ’ అనే హారర్–థ్రిల్లర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందని, ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుందని సమాచారం. ఈ వార్తతో సమీరా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆమెను మళ్లీ వెండితెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.