అక్షరటుడే, వెబ్డెస్క్ : panchayats Funds | గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం మరో రూ.250 కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు నిధులు విడుదల చేశారు.
రాష్ట్రంలో ఇటీవల పంచాయతీలకు పాలకవర్గాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దాదాపు రెండేళ్లుగా గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్లో పడ్డాయి. దీంతో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రజలు నిత్యం సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా డ్రెయినేజీలు, తాగునీరు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నూతన పాలకవర్గ సభ్యులు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు విడుదల కావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఆర్థిక సంఘం (Central Finance Commission) ఇటీవల రెండో విడతలో రూ.387 కోట్లను పంచాయతీలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి నిధులు వస్తుండటంతో ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుధ్య పనులు చేపడుతున్నారు. పాడైపోయిన బోరు మోటార్లు బాగు చేయిస్తున్నారు. ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి మొత్తం రూ.3 వేల కోట్ల వరకు రావాల్సి ఉంది. వీటిని దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది.