అక్షరటుడే, వెబ్డెస్క్: Funds for Panchayats | గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులను విడుదల చేసింది.రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేస్తామని ఇటీవల కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో దాదాపు రెండేళ్లు ఆలస్యంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. సుమారు రూ.3 వేల కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు వెనక్కి పోతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల పంచాయతీ ఎన్నికలు పెట్టింది. దీంతో తొలి విడతగా కేంద్రం రూ. 259.36 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా నిధులను సైతం విడతల వారీగా విడుదల చేయనున్నారు.
Funds for Panchayats | అడ్డంకులు తొలగడంతో..
పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) విజయవంతంగా నిర్వహించడంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అధికారులతో చర్చించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఎన్నికలు పూర్తయ్యాయని, నిధులు విడుదల చేయాలని అధికారులు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నిధుల విడుదలకు గతంలోనే ఓకే చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తొలి విడత నిధులు విడుదల చేసింది. దీంతో పంచాయతీ పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి పనులు చేపట్టనున్నారు. నిధులు విడుదల చేయడంతో సీతక్క కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.