అక్షరటుడే, వెబ్డెస్క్: Panchayat Elections | పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపు కోసం ఎన్నికల సమయంలో నోట్లు, మద్యం, విందుల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టిన అభ్యర్థులు.. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఇప్పుడు ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.
“ఓటు వేయలేదు కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేయండి” అంటూ డిమాండ్ చేయడం పల్లెల్లో కొత్త తలనొప్పిగా మారింది. ఓడిపోయిన అభ్యర్థులు అనుసరిస్తున్న ఈ వినూత్న ‘వసూళ్ల’ పద్ధతులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) శంకర్పల్లి మండలంలో ఓ ఓడిపోయిన అభ్యర్థి టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్నారు.
Panchayat Elections | ఇదేం బ్లాక్ మెయిల్..
తనకు ఓటు వేయకుండా డబ్బులు తీసుకున్న వారి పేర్ల జాబితా తన వద్ద ఉందని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఐదేళ్ల పాటు ప్రతిరోజూ వాట్సప్ స్టేటస్ (WhatsApp Status)లో వారి పేర్లు పెడతానని హెచ్చరించారు. ఇప్పటికే కొందరు పరువు పోతుందనే భయంతో డబ్బులు వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరో స్టేటస్ పెట్టడం పరిస్థితిని మరింత విచిత్రంగా మార్చింది. దీంతో తమ పేరు, పరువు దెబ్బతింటుందన్న భయంతో పలువురు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా సోమ్లా తండాలో మరో ఘటన కలకలం రేపింది. భూక్యా కౌసల్య అనే అభ్యర్థి కేవలం 27 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సేవాలాల్ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ, తనకు ఓటు వేసినట్టు దేవుడి మీద ప్రమాణం చేయాలని, లేదంటే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇక ఖమ్మం జిల్లా (Khammam District) హర్యా తండాలో స్వతంత్ర అభ్యర్థి మాలోత్ రంగ చేసిన హంగామా మరింత సంచలనం సృష్టించింది. తాను ఎన్నికల కోసం దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని, డబ్బులు తీసుకుని తనను ఓడించిన వారు తన సొమ్ము తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ టవర్ ఎక్కి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నల్గొండ జిల్లా (Nalgonda District) నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అక్కడ ఓటమి చెందిన అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి వినూత్నంగా ‘వసూళ్ల’ పర్వానికి తెరలేపారు. ఒక చేతిలో దేవుడి ఫోటో, మరో చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. అప్పులు తెచ్చి మరీ డబ్బులు పంచామని, ఓటు వేయని వారు మానవత్వంతో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని వేడుకుంటున్న దృశ్యాలు స్థానికులను కలచివేశాయి.