అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ration Rice : ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని కేవలం రూ. 10 లేదా రూ. 20 కు దళారులకు అమ్ముకుని, అదే డబ్బుకు మరికొంత కలిపి మార్కెట్లో market రూ. 60 పెట్టి సన్న బియ్యం కొంటున్నారు. చూడటానికి తెల్లగా ఉండే ఆ సన్న బియ్యం తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని భ్రమపడుతున్నారు. కానీ, ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యంలో అంతకంటే శక్తివంతమైన ‘ఫోర్టిఫైడ్ రైస్’ Fortified rice ఉంటాయన్న నిజాన్ని విస్మరిస్తున్నారు. నిజానికి రేషన్ బియ్యం అమ్ముకోవడం అంటే.. మీ ఇంటికి వచ్చిన ఆరోగ్యలక్ష్మిని (ఆరోగ్యాన్ని) బయటకు పంపేయడమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పోషకాహార లోపం: Ration Rice: మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో సుమారు 32 శాతం మంది తక్కువ బరువుతో, 35 శాతం మంది తక్కువ ఎత్తుతో బాధపడుతున్నారు. ఇక మహిళల్లో.. ముఖ్యంగా గర్భిణుల్లో 50 శాతం మంది రక్తహీనత (Anemia) బారిన పడుతున్నారు. తెలంగాణలో 19 ఏళ్లలోపు అమ్మాయిల్లో ఈ సమస్య 64 శాతంగా ఉండటం ఆందోళనకరం. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, రేషన్ షాపుల ద్వారా ‘ఫోర్టిఫైడ్ బియ్యాన్ని’ అందిస్తోంది.
ఫోర్టిఫైడ్ బియ్యం: Ration Rice: ఫోర్టిఫైడ్ బియ్యం అంటే పొలంలో పండేవి కావు, వీటిని ప్రత్యేక సాంకేతికతతో తయారు చేస్తారు. సాధారణ బియ్యం నూకలను పిండిగా మార్చి, అందులో శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలను కలుపుతారు. ఈ మిశ్రమాన్ని యంత్రాల ద్వారా మళ్లీ బియ్యం గింజల ఆకృతిలోకి మారుస్తారు. ప్రతి 100 కేజీల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఇలాంటి పోషకాల బియ్యాన్ని కలుపుతారు. వీటిని తింటే శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందుతాయి.
అక్రమ రవాణా: Ration Rice : ప్రభుత్వానికి ఒక కిలో బియ్యం సరఫరా చేయడానికి సుమారు రూ. 38 ఖర్చవుతుండగా, ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి కిలోకు రూ. 65 వరకు వెచ్చిస్తోంది. ఇంత విలువైన ఆహారాన్ని ప్రజలు తెలియక దళారులకు అమ్ముకుంటున్నారు. దళారులు వీటిని తక్కువ ధరకు కొని, సరిహద్దులు దాటించి ఇతర రాష్ట్రాల్లో రూ. 50 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కలిగే లాభాలు: Ration Rice : ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. విటమిన్ బి12 నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫోలిక్ యాసిడ్ గుండె పనితీరును మెరుగుపరచడమే కాకుండా DNA నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. బయట మార్కెట్లో ఖరీదైన బియ్యం కొనే అవసరం లేకుండానే, ఉత్తమ పోషకాలను ఉచితంగా పొందవచ్చు.
తెల్లగా ఉండే బియ్యం మాత్రమే మంచివనే అపోహ వీడండి. రేషన్ బియ్యంలో ప్రభుత్వం అందిస్తున్న పోషకాల విలువను గుర్తించండి. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకోండి.