అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు. కాగా శనివారం రాత్రి కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి.
మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో రాష్ట్రంలో మొన్నటి వరకు వానలు దంచికొట్టాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. అనంతరం రెండు రోజులు శాంతించిన వరుణుడు మళ్లీ ప్రతాపం చూపుతున్నాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది.
Weather Updates | ఈ జిల్లాలకు అలెర్ట్
తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే అక్కడక్కడ మాత్రమే వానలు పడతాయి. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు జల్లులు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది.
Weather Updates | అన్నదాతల అవస్థలు
వర్షాలతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో చేతిక వచ్చిన పంటలు వానలతో దెబ్బతింటున్నాయి. చాలా చోట్ల వరికోతలు చివరి దశకు వచ్చాయి. అయితే కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
