అక్షరటుడే, ఇందూరు: Raging in Medical College : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల (Nizamabad Medical College) లో దారుణం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు (హౌస్ సర్జన్స్) ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు పది మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
Raging in Medical College : బాధితుడి కథనం ప్రకారం..
హైదరాబాద్ సమీపంలోని పటాన్‌చెరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు (హౌస్ సర్జన్స్) రిజిస్టర్లో నమోదు చేశారు.
బాధిత విద్యార్థి ఈ విషయమై శనివారం (ఆగస్టు 23) సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎందుకు గైర్హాజరు వేశారని అడిగాడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. సుమారు అర గంట పాటు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం.
ప్రశ్నలతో విసిగించారు. ఫోన్ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు.. జాండిస్ అయ్యాయి.. తనను వదిలేయమని ప్రాధేయపడినా.. వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి వాపోయాడు.
Raging in Medical College : ఎమ్మెల్సీ ఇష్యూకు మీనమేషాలు
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్, మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. లోలోపలే కాంప్రమైస్ చేసేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పు చేసిన సీనియర్ల విషయంలో మెడికో లీగల్ కేసు(ఎమ్మెల్సీ) medico legal case (MLC) ఇష్యూ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.