అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Koti shooting case | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కోఠి ఎస్బీఐ (SBI) ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద కాల్పుల ఘటనలో కీలక పురోగతి చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు గుర్తించారు.
కేరళ (Kerala)లోని కోజికోడ్‌కు చెందిన రిన్షాద్ రెడీమేడ్ పిల్లల దుస్తుల వ్యాపారి. ఆయన హోల్‌సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం రూ.6 లక్షల నగదుతో హైదరాబాద్ వచ్చాడు. కొనుగోలు కుదరకపోవడంతో నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి కోఠిలోని ఎస్బీఐ ఏటీఎంకు శనివారం ఉదయం 7 గంటల సమయంలో వెళ్లాడు. డిపాజిట్ మిషన్‌లో మనీ జమ చేస్తుండగా.. ఇద్దరు దుండగులు వెనుక నుంచి వచ్చి, తుపాకీని కడుపు వద్ద పెట్టి బెదిరించారు. అనంతరం అతడిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలతో పరారు అయ్యారు. ఈ ఘటనలో రిన్షాద్ కాలికి గాయమైంది.
Koti shooting case | 800 సీసీ కెమెరాల పరిశీలన
కోఠి కాల్పుల కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నగరంలో ఉదయం రద్దీగా ఉండే రోడ్డుపై కాల్పులు చోటు చేసుకోవడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు స్కూటీపై కాచిగూడ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం వారు ఓ దుకాణంలో బట్టలు మార్చుకొని పరారు అయ్యారు. పోలీసులు 800 సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒకరు పాత నేరస్తుడని సమాచారం. సెల్ ఫోన్ టవర్ డంపింగ్ ద్వారా మొబైల్ నెంబర్ సైతం పోలీసులు సేకరించారు. త్వరలో వారిని అరెస్ట్ చేస్తామన్నారు.