అక్షరటుడే, ధర్పల్లి : CPM Dharpally | ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. వరిధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు (CPM District Secretary Ramesh Babu) డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలకు కల్లాలో, రోడ్లపై ఉన్న వరిధాన్యం పూర్తిగా తడిసిపోయిందన్నారు.
వరిధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా భావించిన దళారులు, రైస్‌మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వం ఐకేపీల (IKP) ద్వారా కొనుగోలు చేసే ధాన్యం కూడా తరుగును క్వింటాలుకు ఆరు కిలోల వరకు తీసుకుంటున్నారన్నారు.
తడిసిన ధాన్యం ధరను మరింతగా తగ్గిస్తున్నందున రైతులు (Farmers) పూర్తిగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (Purchasing Centers) కొనుగోళ్లు ఆలస్యం కావడం వల్ల రోడ్లమీద రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే తరుగు లేకుండా రైతులకు గిట్టుబాట ధర చెల్లించాలని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అని చెబుతున్నారే తప్ప వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, ధర్పల్లి మండల నాయకులు వాల్గోట్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
