అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar | మండలంలోని మాగి గ్రామంలో చెరువు శిఖం భూములను కొందరు కబ్జా చేస్తున్నారని ముదిరాజ్ (Mudiraj) మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కబ్జా బారి నుంచి చెరువులను కాపాడాలని మంగళవారం తహసీల్దార్ భిక్షపతి, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. చెరువు భూములు కబ్జా చేయడంతోపాటు గొల్లగుంట చెరువు తూము ధ్వంసం చేసి చెరువులో నీటిని ఆగకుండా చేస్తున్నారని, గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఐదు చెరువులు ఉంటే, గొల్లగుంట చెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టి చెరువులో నీరు ఖాళీ చేస్తున్నారన్నారు. దీంతోపాటు గ్రామ శివారులోని చెరువుల్లో నుంచి ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుదర్శన్, కార్యవర్గ సభ్యులు కిష్టయ్య, నారాయణ, సత్యనారాయణ, సాయిలు, కిష్టయ్య, బాలరాజు, బాలయ్య, దుర్గయ్య తదితరులున్నారు.