అక్షరటుడే, కామారెడ్డి: polling record | కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆందోళన, అరెస్ట్, కామారెడ్డిలో దొంగ ఓటు వేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరగడం, ఇరువర్గాలకు గాయమైన ఘటనలు మినహాయించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 59.90 శాతం పోలింగ్ నమోదు కాగా సాయంత్రం 5 గంటల వరకు 69.48 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 1,49,525 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1,03,895 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు 54,487 మంది, పురుషులు 49,393 మంది, ఇతరులు 16 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో 99,313 మంది ఓటర్లకు 65,483 మంది ఓటు వేయగా ఇందులో 30822 మంది పురుషులు, 34653 మంది పురుషులు, ఇతరులు 8 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా.. 65.94 శాతం నమోదైంది. ఎల్లారెడ్డి మున్సిపాలిలో 13,265 మంది ఓటర్లకు 10,581 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇందులో పురుషులు 5110 మంది, మహిళలు 5470 మంది, ఇతరులు ఒకరు ఓటుహక్కు వినియోగించుకోగా 79.77 శాతం పోలింగ్ నమోదైంది.
బాన్సువాడ మున్సిపాలిటీలో 24188 మంది ఓటర్లకు గాను 17817 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 8540 మంది, మహిళలు 5470 మంది, ఇతరులు ఆరుగురు ఓటుహక్కు వినియోగించుకోగా 73.36 శాతం పోలింగ్ నమోదైంది. బిచ్కుంద మున్సిపాలిటీలో 12789 మంది ఓటర్లకు 10014 మంది ఓటర్లలో పురుషులు 4921 మంది, మహిళలు 5092 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా 78.49 శాతం పోలింగ్ నమోదైంది.
polling record | మహిళలదే పైచేయి
మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి అనే మాట మరోసారి రుజువైంది. నాలుగు మున్సిపాలిటీలలో 1,49,525 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 48389 మంది, మహిళలు 50907 మంది ఉండగా 2518 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఓటరు జాబితాలోనే కాకుండా ఓటు వేయడంలోనూ మహిళలే ముందంజలో ఉన్నారు. జిల్లాలో నమోదైన పోలింగ్ ను పరిశీలిస్తే 103895 మంది ఓటుహక్కు వినియోగించుకోగా ఇందులో పురుషులు 49393 మంది, మహిళలు 54487 మహిళలు ఉన్నారు. పోలింగ్ శాతంలో కూడా పురుషుల కంటే 5094 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకోవడం గమనార్హం.
బ్యాలెట్ బాక్సులో భవితవ్యం
జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఇక అభ్యర్థుల భవితవ్యం తేలాల్సి ఉంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 92 వార్డులలో మొత్తం 477 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, వీరి భవితవ్యం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది. ఈ నెల 13 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు ఎలా వస్తాయోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో తమకు ఎవరెవరు ఓటు వేశారో.. ఎంత మేరకు మెజారిటీ వస్తుందో లెక్కలేసుకునే పనిలో పడ్డారు.
1 comment
[…] […]
Comments are closed.