అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. జోర్డాన్ (jordan), ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మన్ (Amman)లో ఆయన అడుగు పెట్టారు. అక్కడ మోదీ (Modi)కి ఘన స్వాగతం లభించింది.
జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని స్వాగతించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా జోర్డాన్ పర్యటన జరుగుతోంది. భారతదేశం ప్రపంచ దక్షిణ పాత్రను విస్తరించడానికి, పురాతన సంబంధాలను పెంచడానికి ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ (King Abdullah II ibn Al-Hussein) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ డిసెంబర్ 15, 16 తేదీల్లో జోర్డాన్‌లో ఉంటారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై చర్చలు జరుపుతారు. భారతీయ ప్రవాసులను కూడా ఆయన కలవనున్నారు.
PM Modi | 1947 నుంచి..
భారత్, జోర్డాన్ మధ్య చాలా ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. రెండు దేశాల మొదటి సహకార ఒప్పందం 1947లో కుదిరింది. 1950లో పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఇటీవలి సంవత్సరాలలో ఉన్నత స్థాయి చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా బలోపేతం చేశాయి. 2018లో రాజు అబ్దుల్లా II భారత్ పర్యటన, 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోర్డాన్ పర్యటన, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమ్మాన్ పర్యటన, 2020లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటనతో ఇరు దేశాల మధ్య మరింత బలపడింది.
PM Modi | వాణిజ్య భాగస్వామి
భారతదేశం జోర్డాన్ నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. 2023–24లో ద్వైపాక్షిక వాణిజ్యం 2.875 బిలియన్ల డాలర్లుగా ఉంది. రెండు దేశాలు సంయుక్తంగా ఇఫ్కో-జోర్డాన్ ఫాస్ఫేట్ మైన్స్ కంపెనీ ప్రాజెక్ట్, ఇండో-జోర్డాన్ కెమికల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాయి. ఆరోగ్యం, విద్య, నైపుణ్య అభివృద్ధి, సైన్స్, టెక్నాలజీ, సామర్థ్య నిర్మాణంలో కూడా సహకరిస్తాయి. కాగా ప్రధాని మోదీ డిసెంబర్ 16, 17 తేదీల్లో ఇథియోపియాను సందర్శిస్తారు.