అక్షరటుడే, వెబ్డెస్క్ : Balochistan | బలూచిస్తాన్ (Balochistan) ప్రజలపై పాక్ మరో నిర్బంధ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది.
తమ వనరులను దోచుకుంటోందని ఆరోపిస్తూ బలూచిస్తాన్ ప్రజలు ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అనే వేర్పాటువాద సంస్థ పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో వందలాది మంది పాక్ సైనికులు మృతి చెందారు.
దీంతో బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తాజాగా ఓ వివాదాస్పద చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం 2025కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఎటువంటి ఆరోపణలు, కేసులు లేకున్నా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచకుండానే 90 రోజుల వరకు నిర్బంధించే అధికారం పాక్ సైన్యం, నిఘా సంస్థలకు ఉంటుంది.
దీంతో ఈ చట్టంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సైన్యం బలూచ్ ప్రజలను అక్రమంగా నిర్బంధిస్తోందని వారు వాపోయారు. ఇప్పడు దానిని చట్టం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టంపై పౌర హక్కుల సంఘాలు సైతం మండిపడుతున్నాయి.