అక్షరటుడే, వెబ్డెస్క్: ISRO Chief Narayanan | అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిందని ఇస్రో చీఫ్ వి.నారాయణన్ (ISRO Chief V. Narayanan) తెలిపారు. 2047 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత రోదసి యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.
పీటీఐతో మాట్లాడిన ఇస్రో చైర్మన్ కీలక విషయాలు వెల్లడించారు. చంద్రుడిపై అన్వేషణ కొనసాగుతుందన్న ఆయన.. అక్కడి ఉపరితలంపై ఉన్న ఆనవాళ్లను భూమికి తీసుకొచ్చేందుకు 2027లో ప్రతిష్టాత్మక చంద్రయాన్-4 మిషన్ (Chandrayaan-4 mission) చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2027లో భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్ గగన్యాన్ ప్రయోగానికి సిద్ధమవుతుందన్నారు.
ISRO Chief Narayanan | చంద్రుడిపైకి..
భారతదేశ అంతరిక్ష పరాక్రమాన్ని నొక్కి చెప్పిన ఇస్రో చైర్మన్.. తొమ్మిది అంతరిక్ష విభాగాలలో దేశం ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. చంద్రయాన్-1 మిషన్ (Chandrayaan-1 mission) ద్వారా చంద్రునిపై నీటిని కనుగొనడం నుంచి చంద్రయాన్-3 మిషన్తో దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం వరకు ఇస్రో అనేక విజయాలు సొంతం చేసుకుందన్నారు. వీటి ఆధారంగా 2040 నాటికి భారతదేశం మొట్టమొదటి సిబ్బందితో కూడిన జాబిల్లి యాత్ర చేపట్టాలని ప్రధానమంత్రి నిర్దేశించారని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వికసిత్ భారత్(Vikasit Bharat)లో భాగంగా 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై పాదం మోపుతారన్నారు. ఆ తర్వాత పౌరులను జాబిల్లికి తీసుకెళ్లి, తీసుకురావడానికి గల సామర్థ్యాన్ని ఇస్రో అంచనా వేస్తుందని నారాయణన్ తెలిపారు.
ISRO Chief Narayanan | కీలక ప్రయోగాలు..
రానున్న కొన్నేళ్లలో ఇస్రో అనేక కీలక ప్రయోగాలు చేపట్టనుందని చెప్పారు. భవిష్యత్ ఆశయాలకు మద్దతుగా భూ దిగువ కక్షలోకి 80 వేల కిలోల బరువును మోసుకెళ్లే రాకెట్ ను నిర్మించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 2026 లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షానికి పంపించనున్నట్లు చెప్పారు. 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం, చంద్రుడిపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్, శాస్త్రీయ, వ్యూహాత్మక ప్రాధాన్యతల ఆధారంగా అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాలకు ద్వారాలు తెరిచి ఉంచినట్లు ఇస్రో చీఫ్ వివరించారు.
ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైందన్నారు. ఆదిత్య L1 మిషన్ (Aditya L1 launch) ఇప్పటికే 15 టెరాబిట్లకు పైగా సౌర డేటాను అందించిందని, కరోనల్ మాస్ ఎజెక్షన్లు, అంతరిక్ష వాతావరణంపై లోతైన అంతర్దృష్టులను అందిస్తుందన్నారు. అంతరిక్షంలో భారతదేశం విశ్వసనీయతను ఇస్రో చీఫ్ వివరిస్తూ.. 34 దేశాలకు చెందిన 433 వాణిజ్య ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వివరించారు.