అక్షరటుడే, వెబ్డెస్క్: Oral Hygiene | నోటి ఆరోగ్యం పట్ల మనం చూపే శ్రద్ధ మన మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం లేవగానే పళ్లు తోముకోవడం, నాలుకను శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, ఈ క్రమంలో కొందరికి ఒక వింత అలవాటు ఉంటుంది. నోటిని శుభ్రం చేసుకునే నెపంతో వేళ్లు గొంతు వరకు పెట్టి, కడుపులోని పసరును బలవంతంగా బయటకు తీస్తుంటారు. ఇలా చేస్తేనే నోరు శుభ్రపడిందని, మనసు తేలికగా ఉంటుందని వారు భావిస్తారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Oral Hygiene | కలిగే అనర్థాలు:
జీర్ణక్రియపై ప్రభావం, ఎసిడిటీ: కడుపులోని పసరును బలవంతంగా బయటకు లాగడం వల్ల జీర్ణవ్యవస్థలో ఉండే ఆమ్లాలు రివర్స్ అవుతాయి. దీనివల్ల తీవ్రమైన ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే కాకుండా, తిన్నది వెనక్కి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గొంతు ఇన్ఫెక్షన్స్: బలవంతంగా పసరు తీసేటప్పుడు కడుపులోని గాఢత కలిగిన ఆమ్లాలు గొంతు భాగానికి చేరుతాయి. గొంతులోని సున్నితమైన కణజాలం ఈ ఆమ్లం వల్ల దెబ్బతిని మంట పుడుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటాయి.
దంతాలు, చిగుళ్ల దెబ్బతినడం: కడుపులో ఉండే యాసిడ్ చాలా శక్తివంతమైనది. ఇది మాటిమాటికీ నోట్లోకి రావడం వల్ల దంతాలపై ఉండే రక్షణ కవచం (Enamel) దెబ్బతింటుంది. ఫలితంగా పళ్లు బలహీనపడటం, చిగుళ్ల వాపు వంటి దంత సమస్యలు మొదలవుతాయి.
నిమోనియా ముప్పు: బలవంతంగా పసరు తీసే సమయంలో అది పొరపాటున శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీసి నిమోనియా వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.
నీరసం, అలసట: ఈ ప్రక్రియలో శరీరానికి అవసరమైన పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల రోజంతా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. కొందరిలో ఆపలేని దగ్గు కూడా మొదలవుతుంది.