అక్షరటుడే, కామారెడ్డి: Operation Smile | ఆపరేషన్ స్మైల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా 50 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించామని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
Operation Smile | వివిధ శాఖల సమన్వయంతో..
బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా జనవరిలో జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-12 (Operation Smile-12) నిర్వహించామని ఎస్పీ తెలిపారు. 18ఏళ్లలోపు తప్పిపోయిన లేదా వదిలివేయబడ్డ, కార్మికులుగా పనిచేస్తున్న బాలబాలికలను గుర్తించి వారికి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లామన్నారు. ఈ సందర్భంగా బాలలతో పనిచేయిస్తున్న యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలను కౌన్సెలింగ్ అనంతరం కుటుంబాలకు అప్పగించడం, తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee) సంరక్షణకు అప్పగించామని తెలిపారు.
గనులు, నిర్మాణ రంగం, పరిశ్రమలు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లు, భిక్షాటన తదితర రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేయడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటోందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సరైన విద్య, పోషకాహారం, క్రీడలు, సామాజిక అభివృద్ధి లేకుండా పిల్లలు సమగ్రంగా ఎదగలేరని పేర్కొన్నారు. చిన్నారులను పనుల్లోకి నెట్టడం అంటే వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టవేయడమేనని స్పష్టం చేశారు.
Operation Smile | నేటి బాలలే రేపటి పౌరులు..
నేటి బాలలే రేపటి పౌరులని, చిన్నారులే దేశ భవిష్యత్తుకు పునాది ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఆపరేషన్ స్మైల్-12లో భాగంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 21 కేసులు నమోదు చేసి 46 మంది బాలురు, నలుగురు బాలికలతో కలిపి మొత్తం 50 మందిని కాపాడామన్నారు. వీరిలో 14 మంది బయటి రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. 18ఏళ్లలోపు పిల్లలను వెట్టిచాకిరి, బలవంతపు భిక్షాటన, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫారాలు, కిరాణా దుకాణాలు తదితర ప్రదేశాల్లో పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, ఈ విధమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.