అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rajnath Singh | పాకిస్థాన్‌కు భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పాక్ మంత్రులు కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) సందర్శించారు. అక్కడ తయారైన బ్రహ్మోస్ క్షిపణుల మొదటి బ్యాచ్‌ను శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ట్రైలర్ మాత్రమే అని, పాక్ దుస్సాహసానికి పాల్పడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
Rajnath Singh | స్వదేశీ సామర్థ్యానికి చిహ్నం
లక్నో సాంకేతికత, పరిశ్రమల నగరంగా మారిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మే 11న ఏర్పాటు చేసిన కొత్త బ్రహ్మోస్ ఏరోస్పేస్ (Brahmos Aerospace) యూనిట్ జాతీయ భద్రత వైపు ఒక శక్తివంతమైన అడుగు అన్నారు. ఐదు నెలల్లోనే ఈ యూనిట్లో క్షిపణులు తయారు చేయడంపై ఆయన అభినందించారు. బ్రహ్మోస్ క్షిపణి ఆయుధం మాత్రమే కాదని, స్వదేశీ సామర్థ్యానికి చిహ్నం అని అభివర్ణించారు. ఇది సైన్యం, నావికాదళం, వైమానిక దళానికి వెన్నెముకగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Rajnath Singh | బ్రహ్మోస్ పరిధిలో పాక్
పాకిస్థాన్ (Pakistan) ప్రతి అంగుళం భూమి ఇప్పుడు మన బ్రహ్మోస్ పరిధిలో ఉందని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ పనితీరును ఆయన గుర్తు చేశారు. యూపీ పరివర్తనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కారణమని ప్రశంసించారు. లక్నోలోని యూనిట్లో ఏటా సుమారు 100 క్షిపణి వ్యవస్థలను ఉత్పత్తి చేయొచ్చు. ఈ యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్ చేస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.