అక్షరటుడే, వెబ్‌డెస్క్ : iPhone | సాధారణంగా ఐఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది కెమెరా క్వాలిటీ (Camera Quality). కానీ కెమెరాలు లేని ఐఫోన్‌లు కూడా ఉన్నాయనేది చాలా మందికి తెలియని విషయమే. బయటకు చూస్తే ఇవి మనం ఉపయోగించే ఐఫోన్‌లలా కనిపించినా, వెనుక భాగంలో ఒక్క కెమెరా లెన్స్ కూడా ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కెమెరా లేని ఐఫోన్‌లకే మార్కెట్లో భారీ డిమాండ్ ఉండడంతో పాటు, వీటి ధర సాధారణ ఐఫోన్‌లకంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
iPhone | కెమెరా లేని ఐఫోన్‌లు ఎందుకు తయారు చేస్తారు?
కెమెరాల నిషేధిత ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకంగా ఈ ఐఫోన్‌లు రూపొందించబడతాయి. అత్యంత సెక్యూరిటీ అవసరమయ్యే కొన్ని ప్రదేశాల్లో కెమెరా ఫోన్లు పూర్తిగా బ్యాన్ చేయబడతాయి. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలు, ల్యాబొరేటరీలు, షిప్‌యార్డులు, అత్యంత రహస్య పరిశోధన కేంద్రాలు (Secret Research Centers).. ఇలాంటి హై-సెక్యూరిటీ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులు ఏ పరిస్థితుల్లోనూ కెమెరా ఉన్న ఫోన్లు ఉపయోగించకూడదు. అందుకే వారికి ప్రత్యేకంగా కెమెరా లేని ఐఫోన్‌లను అందిస్తారు. PetaPixel రిపోర్టుల ప్రకారం, అణు పరిశ్రమల్లో ఇది తప్పనిసరి.
iPhone | ధర ఎంతంటే..?
ఆశ్చర్యంగా ఉన్నా నిజం . కెమెరా ఉన్న ఐఫోన్‌లకంటే కెమెరా లేని ఐఫోన్‌ల ధరలు ఎక్కువే. ఈ ఫోన్‌లను నాన్‌క్యామ్ (NonCam) అనే సంస్థ విక్రయిస్తోంది.
iPhone SE (2020) — సుమారు $1,130
iPhone SE (2022) — సుమారు $1,680
ఇవి మార్కెట్లో ఉన్న అసలు ఐఫోన్ ధరల కంటే డబుల్ లేదా ట్రిపుల్ రేట్లు. కారణం, ఈ ఫోన్‌లు హై సెక్యూరిటీ ప్రాంతాల్లో తప్పనిసరి కావడం, అవసరం ఎక్కువగా ఉండడం.
వీటిని ఆపిల్ తయారుచేస్తుందా? అంటే లేదు…! ఈ కెమెరా లేని ఐఫోన్‌లను ఆపిల్ తయారుచేయదు. ఇది పూర్తిగా థర్డ్ పార్టీ కంపెనీల పని. NonCam, Mister Mobile వంటి సంస్థలు అసలు ఐఫోన్‌లలోని కెమెరా మాడ్యూల్‌ను అత్యంత కచ్చితత్వంతో తొలగిస్తాయి. బయటకు చూస్తే ఆపిల్ స్వయంగా అలా డిజైన్ చేసినట్టే కనిపిస్తుంది. రహస్య రక్షణ విభాగాలు, అణు పరిశోధనా కేంద్రాలు, ఆయుధ తయారీ యూనిట్లు, సైనిక నౌకాదళ బేస్‌లు, హై సెక్యూరిటీ ఆఫీస్‌లు వంటి ప్రదేశాలలో ఎక్కువగా వాడతారు. కెమెరా లేకపోయినా, ఈ ఐఫోన్‌లు సెక్యూరిటీ పరంగా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.