అక్షరటుడే, ఇందూరు: Nizamabad MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కేసు నమోదు చేసినట్లు నగరంలోని ఒకటో ఠాణా SHO రఘుపతి తెలిపారు. హరిచరణ్ మార్వాడీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో బుధవారం (ఫిబ్రవరి 11) విధి నిర్వహణలో ఉన్న ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులుపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడినందుకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎంపీ అర్వింద్‌పై సెక్షన్ 132, 223, 296(B) కింద నమోదు చేసినట్లు వివరించారు.
Nizamabad MP Arvind | అసలేం జరిగిందంటే..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నగరంలోని హరిచరణ్ మార్వాడి స్కూల్లో 287, 286, 285 నంబర్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఎస్సై గుర్రం నారాయణ, టౌన్-1 పోలీస్ స్టేషన్‌కు చెందిన సలీమ్ (HC 1019), బి. గోవర్ధన్ (PC 2145), మాక్లూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన శ్రీనివాస్ (PC 2947) ఎన్నికల బందోబస్తు విధులు విధుల్లో ఉన్నారు.
కాగా, మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, ఆయనతో వచ్చిన 7-8 మంది కార్యకర్తలు పోలింగ్ బూత్ నెం. 287 వద్దకు వచ్చి, అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని, పోలింగ్ సిబ్బందిని పరుష పదజాలంతో దూషించినట్లు ఒకటో ఠాణా SHO రఘుపతి పేర్కొన్నారు.
పోలీసులపై అసభ్య, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. పండు @ బంటు ప్రవీణ్ అనే వ్యక్తిని లోపలికి వెళ్లమని.. ఎవరైనా అడ్డుకుంటే బయటకు లాగి తీసుకురమ్మని ఎంపీ ప్రేరేపించినట్లు ఆరోపించారు.
పోలీసులు వారించినప్పటికీ.. నిషేధిత స్టిల్ కెమెరాలు, వీడియో కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి.. పోలింగ్ సిబ్బందిని, డ్యూటీలో ఉన్న పోలీసులను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో వివరించారు.
ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై BNS సెక్షన్లు 132, 223, 296 (B) మరియు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 లోని సెక్షన్ 226 కింద క్రైమ్ నెంబర్ 51/26 గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి వెల్లడించారు.