అక్షరటుడే, ఇందూరు: Nizamabad IIM | ఉత్తర తెలంగాణ ధాన్యాగారంగా విరాజిల్లుతున్న నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మక కేంద్ర విద్యా సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ Indian Institute of Management (IIM) ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తద్వారా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక అడుగు పడుతుందని స్థానిక విద్యావేత్తలు పేర్కొంటున్నారు. వరంగల్‌లో జాతీయ స్థాయి విద్యా సంస్థ ఎన్‌ఐటీ (NIT) అందుబాటులో ఉంది. కాగా, నిజామాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది విద్యార్థులకు మేలు చేకూరడంతోపాటు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఊతం పడుతుందని ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Nizamabad IIM | ప్రీ–బడ్జెట్ భేటీలో భట్టి విన్నపం..
ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రీ–బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి, ప్రాజెక్టు అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని భట్టి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు ఐఐఎంను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఉత్తర తెలంగాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందూరు వంటి నగరాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
Nizamabad IIM | నిజామాబాద్ – భౌగోళిక, ఆర్థిక ప్రాధాన్యం
- తెలంగాణలో వరంగల్ తర్వాత మూడో పెద్ద నగరం
- జాతీయ రహదారులతో అనుసంధానం కలిగిన ప్రధాన జిల్లా
- రైల్వే జంక్షన్‌కు ఒక వ్యూహాత్మక స్థానం కలిగిన ఉన్న ప్రాంతం
- వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపార రంగాల్లో అభివృద్ధి కలిగిన జిల్లా
ఇన్ని అంశాలు కలిగిన నిజామాబాద్ జిల్లా.. ఐఐఎంకు అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
విద్య, ఉపాధి అవకాశాలు
నిజామాబాద్ జిల్లాలో కేంద్ర విద్యాసంస్థ ఐఐఎంను ఏర్పాటు చేస్తే.. ఉత్తర తెలంగాణలోని ఆయా జిల్లాల విద్యార్థులకు మేనేజ్‌మెంట్ విద్యలో సమాన అవకాశాలు లభిస్తాయి. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు వెళ్లే అవసరం తగ్గుతుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వసతి గృహాలు, సేవా రంగాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి లాభాలు కలుగుతాయని విద్యా నిపుణులు చెబుతున్నారు.
దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడ ఐఐఎం ఉన్నాయంటే..
తమిళనాడులోని తిరుచిరాపల్లి, కేరళలోని కోజికోడ్ (కాలికట్) వంటి మహా నగరాల్లో ఐఐఎంలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ కేంద్ర విద్యాసంస్థలు ఆయా ప్రాంతాల్లో విద్య, ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయి. ఇదే తరహాలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేస్తే.. స్థానికంగా అభివృద్ధికి ఊతం లభిస్తుందనే వాదన బలపడుతోంది.
ఎంపీ ధర్మపురి అర్వింద్‌పైనే ఆశలు..
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్వింద్ ధర్మపురి భాజపా ఎంపీ కావడం గమనార్హం. ప్రస్తుతం కేంద్రంలో భాజపా ప్రభుత్వమే ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోనే ఐఐఎంను ఏర్పాటు చేసేలా, ఇందూరుకే ఈ కేంద్ర విద్యాసంస్థను కేటాయించేలా.. కేంద్ర విద్యా శాఖ మంత్రి, ఆర్థిక మంత్రికి ధర్మపురి అర్వింద్ విన్నవించి, వారిని ప్రభావితం చేయాలని నిజామాబాద్ ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు. రాజకీయంగా సమన్వయం ఉంటే ఇందూరు ఐఐఎం ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రాబోయే బడ్జెట్, విధాన పరమైన నిర్ణయాలను బట్టే తెలుస్తుంది.