అక్షరటుడే, ఇందూరు : SSC Inter Exam Arrangements | పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
SSC Inter Exam Arrangements | మార్చి 14 నుంచి ఎస్సెస్సీ..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 24,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వీరిలో 24,399 మంది రెగ్యులర్, 143 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. అలాగే 144 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
SSC Inter Exam Arrangements | ఈనెల 25 నుంచి ఇంటర్..
ఇంటర్ పరీక్షలు (Inter exams) ఈనెల 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు ఉన్నాయని, ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 19,299 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,664 మంది ఉన్నారని, మొత్తం 36,963 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ప్రారంభమయ్యే నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలను ఆయా రూట్ల వారీగా పోలీస్ ఎస్కార్ట్ మధ్య తీసుకెళ్లాలని చెప్పారు.
SSC Inter Exam Arrangements | జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలి..
పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను (Xerox centers) మూసి ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా సమయాలకు బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనవకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
SSC Inter Exam Arrangements | ప్రశ్నాపత్రాలు.. ఆన్సర్షీట్లు..
ప్రశ్న పత్రాలు, ఆన్సర్ షీట్లను తగిన భద్రత మధ్య తరలించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి (Examination Centers) ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే లోనికి అనుమతించాలన్నారు. ముఖ్యంగా చీఫ్ సూపరింటెండెంట్లు ఎంతో బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఏసీపీ మస్తాన్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.