అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra Civic Polls | మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. అధికార ఎన్డీఏ (మహాయుతి) కూటమి ఇప్పటికే 68 సీట్లను కైవసం చేసుకుంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation)తో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఏకగ్రీవం అయిన అభ్యర్థుల లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమికి చెందిన 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో నుంచి వైదొలగడంతో ఏన్డీఏ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో బీజేపీ 44 స్థానాలను దక్కించుకుంది. ఇందులో అత్యధిక స్థానాలు థానే జిల్లా (Thane District)లోని కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్లోనివి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 22 స్థానాలను, అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంది.
Maharashtra Civic Polls | పూణే పీఠం బీజేపీదే..
కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఏకగ్రీవ విజయాలపై మాట్లాడారు. పార్టీ పాలన రికార్డుకు ఇది నిదర్శనమన్నారు. పూణే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. తమ లక్ష్యం 125 స్థానాలు అని, ఇప్పటికే రెండు సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలలో పార్టీ ప్రాబల్యం విస్తరిస్తోందని బీజేపీ (BJP) అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యే అన్నారు.
Maharashtra Civic Polls | బెదిరింపులతో..
ఏకగ్రీవాలపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) పార్టీ స్పందించింది. బెదిరింపులు, లంచాలు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో నామినేషన్లు విత్ డ్రా చేయించారని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈడీ, సీబీఐ (CBI) బెదిరింపులతో తమ అభ్యర్థులను బెదిరిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల కమిషన్ దీనిపై మౌనంగా ఉండటం సిగ్గుచేటు అని ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.