అక్షరటుడే, వెబ్డెస్క్ : Nara Lokesh | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నేతలతో జరిగిన సమన్వయ సమావేశంలో పాల్గొన్న లోకేష్, జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు (Medical Colleges) తీసుకున్నవారిని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలల్లో జైలుకు పంపిస్తామని జగన్ హెచ్చరించిన నేపథ్యంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘జగన్ అరెస్ట్ చేస్తామంటే మేము భయపడాలా?’’ అంటూ ప్రశ్నించిన లోకేష్, ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి జైలులో పెట్టారు… అలా పెట్టి ఏం సాధించారు?’’ అని విమర్శించారు.
Nara Lokesh | రెడ్ బుక్లో ఇంకా పేజీలు ఉన్నాయి..
రాష్ట్రంలో కూడా ఒక ‘సైకో’ ఉన్నాడంటూ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. అరెస్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. నీకన్నా ముందు కూడా చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వారి పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించుకో’’ అని హెచ్చరించారు.ఇదే సమయంలో ‘రెడ్ బుక్’ (Red Book) అంశాన్ని ప్రస్తావించిన లోకేష్, ‘‘ఎర్ర బుక్లో ఇప్పటికి మూడు పేజీలు నిండాయి. ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు’’ అని స్పష్టం చేశారు. ఇది రాజకీయ ప్రతీకారం కాదని, చట్టపరమైన చర్యలేనని సూచించారు.
పార్టీ కార్యకర్తలపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్, ‘‘కార్యకర్తలే మా అధినేతలు. నాయకులు వస్తారు, వెళ్తారు… కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం’’ అని అన్నారు. అబద్ధం తియ్యగా ఉంటుందని, నిజం చేదుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను నిజం చెప్పే వ్యక్తినని, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతానని చెప్పారు.‘‘టీడీపీ కార్యకర్తలందరూ ఒక కుటుంబం. నా మనసులో ఏమున్నా ప్రేమగా చెప్పాల్సినప్పుడు ప్రేమగా చెబుతాను. కోపం వచ్చినప్పుడు అంతే ఘాటుగా మాట్లాడతాను. అది పార్టీ మంచి కోసమే’’ అని లోకేష్ స్పష్టం చేశారు. టీడీపీ (TDP)ని భూస్థాపితం చేస్తామని కొందరు వ్యాఖ్యానించారని గుర్తు చేసిన ఆయన, ‘‘ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరో వందేళ్లు నిలబడుతుంది’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.