అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | గతంలో చేసిన హత్య కేసులో బెయిల్ కోసం నిందితుడు ఓ మహిళ వద్ద అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆమెను కూడా హతమార్చాడు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివారులో మహిళా అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. దోమకొండ (Domakonda) మండలం చింతమాన్ పల్లికి(Chinthaman palli) చెందిన జంగంపల్లి మహేశ్‌పై భిక్కనూరు పీఎస్ పరిధిలో ఓ హత్య కేసు నమోదైంది. ఆ కేసులో బెయిల్ కోసం నర్సన్నపల్లికి చెందిన చిదుర కవిత వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే కవిత తానిచ్చిన డబ్బులు తిరిగివ్వాలని మహేశ్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను హత్యచేస్తే డబ్బులు ఇచ్చే అవసరం రాదని భావించాడు.
గత నెల 30న డబ్బులు ఇస్తానని, పొలం వద్దకు రావాలని చెప్పగా ఆమె వెళ్లింది. పథకం ప్రకారం కవిత రాగానే ఆమెను కొట్టి చీరకొంగుతో ఉరివేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు, ఫోన్‌ను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అదుపులోకి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు పాల్గొన్నారు.