అక్షరటుడే, వెబ్డెస్క్: Municipal Elections | మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Election Commissioner Rani Kumudini) మీడియాతో మాట్లాడనున్నారు.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల తర్వాత ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి రానుంది. ఎన్నికల కమిషనర్ కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను అధికారులు వెలువరించారు. రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు సెంటర్ల ఏర్పాటు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం పుర పోరుకు షెడ్యూల్ విడుదల కానుంది.
Municipal Elections | ఫిబ్రవరి 13న ఎన్నికలు!
రాష్ట్రంలో ఫిబ్రవరి 15 లోపే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఒకే విడతలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు (Corporation Elections) జరగనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 13న ఎన్నికలు నిర్వహించి, 15న ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనిపై సాయంత్రం క్లారిటీ రానుంది. షెడ్యూల్ విడుదల అయితే బల్దియాల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇప్పటికే పట్టణాల్లో పురుపోరుపై జోరుగా చర్చ సాగుతోంది. ఆశావహులు నిత్యం తమ వార్డుల్లో పర్యటిస్తూ.. గెలిపించాలని కోరుతున్నారు. సమయం తక్కువగా ఉండటంతో రెండు మూడు రోజుల్లో ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు టికెట్లు కేటాయించడానికి సర్వేలు చేశాయి. వాటి నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలను బరిలో దించడానికి సిద్ధం అవుతున్నాయి.