అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Arvind Interview | ఎంపీ ధర్మపురి అర్వింద్ జర్నలిస్ట్ అవతారం ఎత్తారు. ఆయన బుధవారం నిజామాబాద్ (Nizamabad)లోని మార్కెట్ యార్డులో పసుపు పంటను పరిశీలించారు. అనంతరం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని ఇంటర్వ్యూ చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటుతో ఫలితం దక్కిందా అని ఎంపీ ప్రశ్నించారు. దానికి గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు రావడానికి ఎంపీ అర్వింద్ కారణమన్నారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పంటకు మంచి ధర రావాలంటే మార్కెట్ ముఖ్యమన్నారు. దీని కోసం ఎగుమతులు, ప్రమోషన్లపై కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పసుపు క్వింటాల్‌కు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తుందన్నారు. అయితే నిజామాబాద్‌లో రేటు రాకపోవడంపై తాను వ్యాపారులతో మాట్లాడినట్లు గంగారెడ్డి (Palle Gangareddy) చెప్పారు. రైతులు పచ్చి పసుపు తెస్తున్నారని వ్యాపారులు, అధికారులు తనకు చెప్పారన్నారు.
MP Arvind Interview | అవగాహన కల్పిస్తున్నాం
రైతులకు (Farmers) నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్మర్పల్లి (Kammarpalli)లో రీసెర్చ్ సెంటర్ ఉందన్నారు. కొత్త వంగడాలు వచ్చిన రైతులు ఎర్రగుంటు అనే పసుపు రకాన్ని మాత్రమే సాగు చేస్తున్నారని ఛైర్మన్ తెలిపారు. పసుపు రైతులకు దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాలను ఎంపిక చేసి పసుపు సాగు విధానాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఏ రకమైన వెరైటీ సాగు చేయాలనే విషయమై వివరించామన్నారు.
MP Arvind Interview | సబ్సిడీపై పరికరాలు
పసుపు రైతులకు ఏమైన సబ్సిడీలు అందిస్తున్నారా అని అర్వింద్ ప్రశ్నించారు. దీనిపై పసుపు బోర్డు ఛైర్మన్ మాట్లాడుతూ.. ఎఫ్‌పీవోలకు 90శాతం సబ్సిడీపై, రైతులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం రాయితీపై బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పసుపు తవ్వకాల మిషన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈయూతో వాణిజ్య ఒప్పందంతో పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రేట్లు పెరుగుతాయన్నారు. యూరోపియన్ దేశాలు ఆర్గానిక్ పసుపు (Organic Turmeric) అడుగుతున్నాయని చెప్పారు. పసుపు బోర్డు ద్వారా ఎగుమతుల లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. ఆర్గానిక్ పసుపు పండించే రైతులకు ఎకరాకు రూ.16 వేల ప్రోత్సాహం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.