అక్షరటుడే, వెబ్‌డెస్క్: తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. తనపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేశారు. విచక్షణాధికారాలు ఉపయోగించి ఆయనను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు.
MLC Kavitha | తెలంగాణలో మహిళలకు ప్రత్యేక గౌరవం
తెలంగాణలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘బోనం ఎత్తుకునే ఆడబిడ్డను అమ్మవారిలా చూసే సంస్కృతి మనది. రాష్ట్రంలో మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తూ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. కానీ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు పరుష వ్యాఖ్యలతో విమర్శలు చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వెనకాడదతారు’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై ఉచ్ఛరించలేని దారుణమైన వ్యాఖ్యలను చేశారు.
MLC Kavitha | బీసీ సమస్యలపై పోరాటం చేస్తున్నాం
దాదాపు ఏడాదిన్నరగా బీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నాం. తాను ఏ రోజూ తీన్మార్ మల్లన్నను ఒక్క మాట కూడా అనలేదు. నన్ను ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదన్నారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు జాగృతి కార్యకర్తలు వెళ్లారన్నారు. అంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అంటూ ప్రశ్నించారు. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా అని మండిపడ్డారు. ఇక నుంచి నేను ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తక్షణమే తీన్మార్ మల్లన్నను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తాం’’ అని కవిత చెప్పారు.
MLC Kavitha | డీజీపీకి కవిత ఫిర్యాదు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై డీజీపీకి కవిత ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో ఆమె డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. కాగా.. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.