అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | రాష్ట్ర మంత్రివర్గం దుండపాళ్యం ముఠాలా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Former Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటాల కోసం మంత్రులు వర్గాలుగా చీలిపోయారని ఆరోపించారు. కాంట్రాక్టుల్లో వాటాల కోసం, అక్రమ వసూళ్ల కోసం కొట్టుకుంటున్నారన్నారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్(Telangana Bhavan)లో హరీశ్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలనను గాలికొదిలేసిన మంత్రులు కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టుల్లో వాటాల కోసమే కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు ఏర్పడుతున్నాయన్నారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఇంకొకరు, వాటాల కోసం మరొకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఇంకొకరు.. ఇలా మంత్రులు వర్గాలుగా విడిపోయారని ఆరోపించారు. కేబినెట్ సహచరులు రోడ్డెక్కుతుంటే వారించాల్సిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Harish Rao | కాంగ్రెస్ ది తుపాకుల సంస్కృతి..
కాంగ్రెస్ పార్టీ (Congress party) తెలంగాణలో తుపాకుల సంస్కృతి తీసుకొచ్చిందని హరీశ్ రావు మండిపడ్డారు. ఎవరికి అందినకాడికి వారు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు, వ్యాపారులను (investments and industries) బెదిరించడం పెరిగిపోయిందన్నారు. తమ హయాంలో పరిశ్రమలు తీసుకొస్తే, కాంగ్రెస్ పాలనలో తిరిగి వెళ్లిపోతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఈ ఏడాది అతి తక్కువ పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. వ్యాపారవేత్తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరించి వసూలు చేస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు.
ఇది తాము చేస్తున్న ఆరోపణలు కాదని, స్వయంగా ఒక మంత్రి కుమార్తె చెప్పిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిష్పక్షిక దర్యాప్తు జరపాలన్నారు. హోం శాఖ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వద్దే ఉంటే నిస్పాక్షిక దర్యాప్తు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, కబ్జాలు పెరిగిపోయాయన్నారు. కొందరు నాయకులు, వారి అనుచరుల ఆగడాలకు హద్దే లేకుండా పోయిందన్నారు.
Harish Rao | వాటాల కోసమే కేబినెట్ భేటీ..
మంత్రివర్గం దండుపాళ్యం బ్యాచ్ గా మారిందని మాజీ మంత్రి హరీశ్ విమర్శించారు. ముఠా పంచాయితీలు తెంపుకోవడానికి కేబినెట్ మీటింగ్ (cabinet meeting) పెట్టుకున్నారని ఆరోపించారు. మరోవైపు, మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటుంటే సీఎం చోద్యం చేస్తున్నారన్నారు. మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి.. తెలంగాణ పరువును బజారున పడేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ (KCR) పాలనలో కేంద్రంతో కొట్లాడి నీళ్ల వాటా, నిధుల వాటా సాధించామని, కేసీఆర్ హయాంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ ఉండేదని గుర్తు చేశారు. టెక్ మహేంద్ర సీఈవో (CEO of Tech Mahendra) వచ్చినప్పుడు వర్షం పడుతుంటే తానే గొడుగు పట్టి వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సంస్కృతి మాది.. తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని ఆరోపించారు. ముఖ్యమంత్రి తెలంగాణలోకి గన్ కల్చర్ తీసుకువచ్చాడని అందుకే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోయాయన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయన్నారు.