అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cognizant Office | ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సాఫ్ట్వేర్ కంపెనీ (Software Company)లను రాష్ట్రంలో ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలో పలు కంపెనీలు అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసింది. దీనిని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (IT Minister Nara Lokesh) శుక్రవారం ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మహతి ఫిన్‌టెక్ భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేశారు. వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంలో దీనిని రూపొందించారు. ప్రారంభోత్సవంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Cognizant Office | చంద్రబాబు శంకుస్థాపన
ప్రస్తుతం కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించారు. అయితే శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు. శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శంకుస్థాపన చేయనున్నారు. కార్యాలయం కోసం కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను కాగ్నిజెంట్‌కు కేటాయించారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపస్ (Digital Transformation Campus)ను నిర్మించనుందన్నారు. మూడు దశల్లో రూ.1,583 కోట్లతో కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కంపెనీతో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మొదటి దశ పనులు 2029 వరకు పూర్తవుతాయని తెలిపారు. 2033 వరకు మొత్తం పనులు పూర్తయి కార్యాలయం అందుబాటులోకి వస్తుందన్నారు.