అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Hundi counting | మేడారం జాతర (Medaram Jathara) హుండీల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రోజు 140 హుండీలను లెక్కించగా.. రూ.2.01 కోట్ల ఆదాయం వచ్చింది.
ములుగు (Mulugu) జిల్లా మేడారంలో సామక్క–సారక్క మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు వైభవంగా కొనసాగిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా అధికారులు మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర పూర్తి కావడంతో వాటిని హనుమకొండలోని టీటీడీ (TTD) కల్యాణ మండపంలోకి తరలించారు. అక్కడ భారీ భద్రత మధ్య మూడు రోజులుగా హుండీలను లెక్కిస్తున్నారు.
Medaram Hundi counting | 425 హుండీల లెక్కింపు
జాతర కోసం మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా.. మూడు రోజుల్లో 425 హుండీలను లెక్కించారు. ఇప్పటి వరకు రూ.8,06,46,359 ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నారు. గురువారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Surekha) హుండీల లెక్కింపును ప్రారంభించారు. ఈ ప్రక్రియ మరో మూడు, నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉంది. 200 మంది అధికారులు, 300 మంది వాలంటీర్లతో భారీ భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు.
Medaram Hundi counting | తడిసిన నోట్లు
హుండీలో భక్తులు నోట్లు, కాయిన్స్‌తో పాటు కొబ్బరి ముక్కలు, బెల్లం సైతం వేశారు. దీంతో పలు నోట్లు తడిసిపోయాయి. లెక్కింపునకు ఇబ్బంది అవుతోంది. అలాంటి నోట్ల లెక్కింపు కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. కౌంటింగ్ ప్రాంతంలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా పలువురు భక్తులు నోట్లపై తమ కోరికలు రాసి హుండీలలో వేశారు. మరికొంత మంది చిటీలు సైతం వేశారు.