అక్షరటుడే, వెబ్డెస్క్: Medak Road Accident | పంచాయతీ ఎన్నికల్లో panchayat elections ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్తున్న ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం బలిగొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా Medak district లోని చిన్న శంకరంపేట్ శివారులో శనివారం (డిసెంబరు 13) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది,
ఓటు వేయడానికి సొంతూరు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో రైతులు రోడ్డుకు ఒకవైపు ధాన్యం ఆరబోశారు. దీంతో వాహనాలు ఒకేవైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో బైక్పై ఈ కుటుంబం సొంతూరుకు వెళ్తూ.. ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Medak Road Accident | ఓటు వేసేందుకు వస్తూ..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కుర్మ లింగయ్య (45), ఆయన భార్య సాయవ్వ (38) దంపతులకు సాయిలు (15), మానస (8) సంతానం. బతుకు దెరువు కోసం వీరు హైదరాబాద్కు వలస వెళ్లారు.
కాగా, ఆదివారం వారి గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ దంపతులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బైక్పై తమ సొంతూరుకు బయలుదేరారు. అయితే, మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనం వీరిని వేగంగా ఢీకొనడంతో నలుగురు కూడా అక్కడికక్కడ దుర్మరణం చెందారు.
Medak Road Accident | ధాన్యం ఆరబోయడం వల్లే..
ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ రహదారులపై ఆరబోస్తున్న ధాన్యం వాహనదారులకు శాపంగా మారుతున్నాయి. ఏటా ఎంతో మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇక, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ప్రజాప్రతినిధులు.. అసలు దీనిని ఒక సమస్యగానే భావించడం లేదు. ప్రమాదం జరిగితే కొద్ది రోజులపాటు హడావుడి చేసి, ఆపై సమస్యను గాలికి వదిలేస్తున్నారు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది.