అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Rains | మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో బుధవారం ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో రోడ్లు జలమయం అయి పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పలు ప్రాంతాల్లో పర్యటించారు.
మాసబ్ ట్యాంక్ (Masab Tank) నుంచి లక్డీకపుల్ వైపు వస్తున్నప్పుడు మెహదీ ఫంక్షన్ హాల్ వద్ద వర్షపు నీరు రోడ్డు మీద నిలవడానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వర్షపు నీరు నిలవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని.. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కమిషనర్లు ఆదేశించారు. ఇప్పటికే ఇక్కడ ఇరువైపులా రోడ్డును తవ్వి రెండు ఫీట్ల విస్తీర్ణంతో ఉన్న పైపులైన్లను వేశామని.. వాటికి మహవీర్ ఆసుపత్రి (Mahavir Hospital) పరిసరాలతో పాటు చింతలబస్తీ ప్రాంతాల నుంచి వచ్చిన మురుగు, వరద నీటిని అనుసంధానం చేయాల్సినవసరం ఉందన్నారు. త్వరితగతిన ఈ పనులు కూడా పూర్తి చేయాలని సూచించారు.
Hyderabad Rains | పైప్లైన్లో మట్టి తొలగించాలి
మహావీర్ ఆస్పత్రి ముందు నుంచి మెహిదీ ఫంక్షన్ హాల్ వరకు రోడ్డుకు పక్కగా ఉన్న పైపులైన్లలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే.. సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుందని కమిషనర్లు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా పైపులైన్ల అనుసంధానం పనులు వేగంగా జరిగేలా సహకరించాలని సూచించారు. హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

