అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని కాటేదాన్‌లో (Katedan) ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నగరంలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో (Katedan industrial area) తరచు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mylardevpally police station) పరిధిలోని టాటానగర్‌లో ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంలో మంటలు ఎగిసి పడ్డాయి. దట్టంగా పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.
Hyderabad | కేసు నమోదు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Hyderabad | చర్యలు కరువు
హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) పలు పారిశ్రామికవాడల్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన పలు ప్రమాదాల్లో కార్మికులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం రాత్రి, తెల్లవారు జామున ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రాణ నష్టం తప్పుతోంది. అయితే ఆయా పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గతంలో పాశమైలారం రియాక్టర్ పేలుడు సమయంలో పరిశ్రమల్లో భద్రత చర్యలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.