అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Mass Surrender | మావోయిస్ట్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), ఒడిశా రాష్ట్రాల్లో శనివారం భారీగా నక్సలైట్లు లొంగిపోయారు. వారిలో పలువురు కీలక సభ్యులు సైతం ఉన్నారు.
దేశంలో మార్చి 31 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టి, అడవులను జల్లెడ పడుతోంది. దీంతో ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు చనిపోతున్నారు. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల లొంగుబాటును ప్రోత్సహిస్తున్నాయి. ఆపరేషన్ కగార్తో కేంద్ర బలగాలు చొచ్చుకువస్తుండటంతో నక్సలైట్లు ఆయుధాలు వీడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ (Bastar) డివిజన్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో శనివారం మొత్తం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై రూ.1.60 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
Maoists Mass Surrender | 20 మంది మహిళలు
బీజాపూర్ (Bijapur) జిల్లాలో ముప్పై మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అందులో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. సుక్మా జిల్లాలో 21 మంది ఆయుధాలు వీడారు. AK-47 రైఫిల్స్, SLRలు, బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో సహా ఆటోమేటిక్ ఆయుధాలను బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పి, సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్, CRPF డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆనంద్ సింగ్ రాజ్పురోహిత్లకు అందజేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద రూ.50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించారు.
Maoists Mass Surrender | ఒడిశాలో..
ఒడిశా పోలీసుల ఎదుట 15 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచిపెట్టారు. రాయగడలోని జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో)లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఒడిశా పోలీసుల అదనపు డైరెక్టర్ జనరల్ సంజీబ్ పాండా ఎదుట వీరు లొంగిపోయారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ చేపట్టిన నిరంతర ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీ బలహీనంగా మారిందన్నారు. 15 మంది మావోయిస్టులలో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారు.