Homeజిల్లాలుహైదరాబాద్GHMC | మద్యం మత్తు.. భార్య అనుకుని పక్కింటి యువతిని కత్తితో పొడిచిన వ్యక్తి

GHMC | మద్యం మత్తు.. భార్య అనుకుని పక్కింటి యువతిని కత్తితో పొడిచిన వ్యక్తి

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: GHMC : అతగాడికి తన భార్యపై విపరీతంగా కోపం వచ్చింది. ఆమెతో గొడవకు దిగాడు. కాసేపు వాదులాడి అలిగి బయటికి వెళ్లిపోయాడు. ఫూటుగా మద్యం తాగేసి వచ్చాడు. మద్యం మత్తులో తన ఇల్లు అనుకుని పక్కింటికి వెళ్లాడు. అక్కడ ఉన్న యువతిని తన పెళ్లాంగా పొరబడి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌(Mailardevpally police station) పరిధిలో శుక్రవారం(జూన్‌ 6) రాత్రి జరగగా.. శనివారం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు కథనం ప్రకారం.. మహారాష్ట్ర(Maharashtra)లోని నాందేడ్‌(Nanded)కు చెందిన సలీమ్‌(60), రేష్మ దంపతులు సిటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. కూతురు హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని టీఎన్‌జీవోస్‌ కాలనీలో ఉంటోంది.

మూడేళ్ల క్రితం సలీమ్‌ దంపతులు హైదరాబాద్‌కి వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలోని ఉద్డంగడ్డ(Uddangadda)లో నివాసం ఉంటున్నారు. వీరి గది పక్కనే జేబేదా(26) అనే మహిళ కుటుంబంతో కలిసి ఉంటోంది. కాగా, గత కొద్ది రోజులుగా సలీమ్‌ తన భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం గొడవ పెద్దది కావడంతో ఫుల్లుగా మద్యం తాగొచ్చి, తన గది అనుకుని పక్కనే ఉన్న జుబేదా ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న జుబేదాను తన భార్య రేష్మ అనుకుని కత్తితో పొడిచాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సలీమ్‌కు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. జుబేదాను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైయార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ నరేందర్ తెలిపారు.